ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జోనల్ వ్యవస్థ: 26 జిల్లాలకు ఆరు జోన్‌లు, రెండు మల్టీ జోన్‌లుగా విభజన

పాలకొండ వెబ్ న్యూస్:
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్ 1975 ను సవరిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి స్థానికత, కేడర్, జోనల్, మల్టీజోనల్ నిబంధనలపై స్పష్టతనిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలో ఈ మార్పులు అమలు కానున్నాయి.
6 జోన్లు, 2 మల్టీ జోన్ల నిర్మాణం
నూతన నిబంధనల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ను ఆరు జోన్లుగా, వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజించారు.
మల్టీ జోన్-1
| జోన్-1 | శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి |
| జోన్-2 | అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కోనసీమ 
| జోన్-3 | పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా 
మల్టీ జోన్-2
| జోన్-4 | గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
| జోన్-5 | తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప |
| జోన్-6 | నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి |
స్థానికత నిబంధనల్లో మార్పులు
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థి/అభ్యర్థి ఏడేళ్లు ఒకే ప్రాంతంలో చదివి ఉంటే, ఆ ప్రాంతాన్నే స్థానికంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ కొత్త నిబంధనల అమలుతో ఇకపై రాష్ట్రంలో జరగబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు ఈ జోనల్, మల్టీజోనల్ విభజన కీలకం కానుంది.
ఈ కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు, స్థానిక అభ్యర్థులకు నిర్దిష్ట ప్రాంతాల్లో అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

0 Comments