పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డు, కుమ్మరి వీధిలో తీవ్ర విషాదం అలుముకుంది. భవానీ మాల ధరించి, అమ్మవారి మొక్కులు తీర్చుకుని వస్తున్న ద్రాక్షవరపు రాంబాబు (36) రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆ కుటుంబానికి ఇది తీరని లోటు.
ఈ నెల 13వ తేదీ రాత్రి ప్రత్తిపాడు జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పాలకొండ నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు వెళ్లిన భవానీ భక్తులలో రాంబాబు కూడా ఉన్నారు. తిరిగి వస్తుండగా, బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీకొట్టింది. ఎంతో భక్తితో మొక్కు తీర్చుకుని వస్తున్న వ్యక్తికి ఇలా జరగడం విధి ఆడిన వింత నాటకం.
సమాచారం అందుకున్న 16వ వార్డు కౌన్సిలర్ కడగల వెంకటరమణ సోమవారం రాత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం ప్రక్రియలు పూర్తి చేశారు. మంగళవారం మృతదేహాన్ని పాలకొండకు తీసుకువస్తున్నారు. ఈ విషాద వార్త తెలియగానే, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారి గుండెలను మెలిపెట్టింది. ఆ వీధి మొత్తం విషాదఛాయలు కమ్ముకున్నాయి.
0 Comments