పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శ్రీ కృష్ణ సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో కె. చౌదరి నాయుడు అధ్యక్షతన పెన్షనర్స్ డే మరియు సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 79, 78 సంవత్సరాలు నిండిన సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం పెన్షనర్ల సమస్యలపై చర్చించి పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైవ్ సర్టిఫికెట్లను స్థానిక ట్రెజరీ కార్యాలయంలో జీవన్ ప్రమాణం పోర్టల్ ద్వారా 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు సమర్పించవచ్చని నాయకులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై తో పాటు 2025 జనవరి, జూలై డి.ఏ లను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే డి.ఏ మరియు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 12వ వేతన సంఘాన్ని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఇటీవల రిటైరైన పెన్షనర్లకు రావాల్సిన సంపాదిత సెలవులు, గ్రాట్యుటీ, పీఎఫ్, APGLI చెల్లింపులు వెంటనే జరపాలని, 70 మరియు 75 ఏళ్లు నిండిన పెన్షనర్లందరికీ ఇదివరకు చెల్లించిన విధంగానే పెన్షన్‌లో 10 శాతం, 15 శాతం అదనపు క్వాంటం మంజూరు చేయాలని తీర్మానించారు. ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్సలు అందించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, మరణించిన పెన్షనర్ల అంత్యక్రియల సొమ్మును వారి వారసులకు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కె.వి. రమణమూర్తి, ఉపాధ్యక్షులు పి. వెంకట నాయుడు, సహాయ కార్యదర్శి అచ్యుత, సంయుక్త కార్యదర్శులు ఎస్. నరసింహమూర్తి, ఏ. రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
0 Comments