ఏపీలో జనన, మరణ నమోదు నిబంధనలు కఠినతరం: గడువు దాటితే జరిమానాలు


పాలకొండ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన మరణాల నమోదు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జనన లేదా మరణం సంభవించిన 21 రోజుల్లోపు సంబంధిత విభాగంలో నమోదు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత నమోదు చేసే వారిపై అపరాధ రుసుములను కూడా ఖరారు చేశారు.

​ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, పుట్టిన లేదా మరణించిన తేదీ నుండి 21 రోజులు దాటిన తర్వాత, అంటే 21 నుండి 30 రోజుల్లోపు నమోదు చేస్తే 25 రూపాయల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 30 రోజుల గడువు కూడా దాటి ఏడాది లోపు నమోదు చేయాల్సి వస్తే, సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవడంతో పాటు 250 రూపాయల జరిమానా కట్టాలి. శిశువు పుట్టిన సమయంలో పేరు నమోదు చేయని పక్షంలో, 12 నెలల లోపు ఉచితంగా పేరును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఏడాది కాలం దాటిన తర్వాత పేరు నమోదు చేయాలంటే మాత్రం 250 రూపాయల అపరాధ రుసుము వర్తిస్తుంది.

​నమోదు ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఒకవేళ జనన లేదా మరణాల నమోదు ఏడాది కాలం దాటిపోతే మాత్రం నేరుగా నమోదు చేయడం వీలు పడదు. అటువంటి సందర్భాల్లో జిల్లా మేజిస్ట్రేట్ లేదా ఆర్డీవో నుండి ప్రత్యేక ఆదేశాలు పొందడం తప్పనిసరి. ఈ ఆలస్యానికి గాను ప్రభుత్వం 500 రూపాయల భారీ అపరాధ రుసుమును నిర్ణయించింది. ప్రజలందరూ ఈ మార్పులను గమనించి సకాలంలో జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News by: BSS Prasad

Post a Comment

0 Comments