పాలకొండ వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా సాగు భూములు పోషకాల లోపంతో నిస్సారమవుతున్నాయని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీఆర్‌ఐఈఆర్ నివేదిక ప్రకారం, మితిమీరిన రసాయనాల వాడకం వల్ల నేలల్లో సేంద్రియ కర్బనం సగానికి పైగా క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన నేలలో ఉండాల్సిన 1.5 శాతం కర్బనం, ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో 0.75 శాతానికి పడిపోవడం వల్ల ఏటా 5.3 బిలియన్ టన్నుల పైపొర మట్టి కొట్టుకుపోతోందని వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం జింక్ లోపం ఉందని, ప్రభుత్వం కేవలం యూరియాపైనే అధిక సబ్సిడీ ఇస్తూ సూక్ష్మ పోషకాలను విస్మరిస్తోందని విమర్శించారు. దీనివల్ల దిగుబడులు పెరిగినా ఆహారంలో పోషక విలువలు పడిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు వాడుతూ భూసారాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం సబ్సిడీపై సూక్ష్మ పోషకాలు అందించాలని ప్రసాదరావు కోరారు.
news by: BSS Prasad
0 Comments