నీరు లేక బీడువారుతున్న తోటపల్లి 7, 8 బ్రాంచి కాలువలు: తహసీల్దార్‌కు ఖండాపు ప్రసాదరావు వినతి

​పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 16, 2026: తోటపల్లి ఎడమ కాలువ పరిధిలోని 7, 8 బ్రాంచి కాలువల కింద ఉన్న సాగు భూములు నీరు లేక బీడువారు తున్నాయని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పాలకొండ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఎగువ ప్రాంతాల్లో రబీ సాగుకు పుష్కలంగా నీరు అందుతుంటే, దిగువన ఉన్న 7, 8 బ్రాంచిల పరిధిలోని 45 వేల ఎకరాలకు కనీసం ఆరుతడి పంటలకు కూడా నీరు విడుదల చేయకపోవడం పట్ల మండిపడ్డారు. పొలాలు ఎండిపోవడమే కాకుండా, చెరువుల్లో నీరు లేక మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయని ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కాలువలకు నీరు విడుదల చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు.

​News by: BSS Prasad

Post a Comment

0 Comments