సేంద్రియ వ్యవసాయమే శరణ్యం: అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 21.03.2026:​రసాయన సాగు వల్ల నేలతో పాటు మానవులు కూడా తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం ఆహారంలో రసాయనిక అవశేషాల వల్ల అంటువ్యాధులు, ఎన్‌సీడీసీ వంటి రోగాలు వేగంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయని, ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పని కాదని, ఇది క్రమబద్ధంగా మరియు శాస్త్రీయంగా జరగాలని సూచించారు. దీనికోసం ప్రభుత్వం రసాయన ఎరువుల స్థానంలో జీవన ఎరువులను ప్రోత్సహించాలని, నేల ఆరోగ్యం మరియు సూక్ష్మ జీవుల పాత్రపై వ్యవసాయ పరిశోధన స్థానాలు దృష్టి సారించాలని కోరారు. నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవ వైవిద్యాన్ని పెంపొందించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

​ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని ప్రసాదరావు కోరారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను మనం నియంత్రించలేకపోయినా, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలమని స్పష్టం చేశారు. పెట్టుబడి తగ్గించి ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రో కెమికల్స్‌లో అధిక భాగం ఆహార వ్యవస్థకే వినియోగిస్తున్నారని, ఇంధన ధరల మార్పు సామాన్యుడి ఆహార ధరను ప్రభావితం చేస్తోందని వివరించారు. ప్రతి రైతు పశు సంపదను పెంచుకుంటూ జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వేప నూనె వంటివి స్వయంగా తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంటలను పండించడమే లక్ష్యంగా సాగాలని ఆయన సూచించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments