పాలకొండ వెబ్ న్యూస్ : కురపాం (పార్వతీపురం మన్యం జిల్లా): మారుమూల ప్రాంతాల్లోని గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే తమ ముఖ్య లక్ష్యమని శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ లక్ష్యంలో భాగంగా, సంజీవ రక్ష ఫౌండేషన్ మరియు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో కురపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా పేద ప్రజలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా, చలికాలం దృష్ట్యా సహాయ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు, ఇందులో 250 మంది పేద ప్రజలకు దుప్పట్లను, అలాగే గ్రామంలోని 480 మంది విద్యార్థినిలకు సానిటరీ నాప్కిన్స్ మరియు ప్యాడ్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ దూభ పద్మావతి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు వైద్యంతో పాటుగా తమ తరఫున కొంత సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తాము అన్ని విధాలుగా గిరిజనులకు అందుబాటులో ఉంటూ, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 24/7 వైద్యపరమైన సహాయ సహకారాలు అందించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ దూబ రాంబాబు, శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి శంకర్, డాక్టర్ వేలంగని, డాక్టర్ అనుపమ, డాక్టర్ రత్నం, హాస్పిటల్ మేనేజర్ ధర్మ, మార్కెటింగ్ మేనేజర్ రవి, శ్రీకాంత్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments