పాలకొండ వెబ్ న్యూస్..ఫిబ్రవరి 20, 2026పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో గేటు వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యు ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పినాకిల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, డిపోల మూసివేత చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సిఐటియు మద్దతు ప్రకటించింది. ఎస్ డబ్ల్యు ఎఫ్ డిపో కార్యదర్శి ఏఎస్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు డిపో మేనేజర్‌కు మెమొరాండం అందజేశారు.
ఈ సందర్భంగా జోనల్ నాయకులు బీవీ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణా రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-బస్సు పథకం వల్ల ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ పరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 88 ప్రకారం 2029 నాటికి వంద శాతం విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల వేలాది మంది ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని, ఇప్పటికే పలు డిపోలను పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. జిసిసి పద్ధతి వల్ల ఛార్జీలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని, మహిళలకు ఉచిత ప్రయాణం ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. వెంటనే కొత్త డీజిల్ బస్సులు కొనాలని, ఖాళీగా ఉన్న 11,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాదా రాము, సిహెచ్ సంజీవి, పెదగాడ రమణ, దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments