ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి రోజువారీ కూలీ. ఇంట్లో ఎప్పుడూ పూట గడవడమే కష్టంగా ఉండేది. ఒకరోజు రాము తన దీనస్థితిని చూసి బాధపడుతుండగా, ఊరిలో ఉన్న ఒక పెద్దాయన బిల్ గేట్స్ చెప్పిన ఒక మాటను గుర్తుచేశాడు: "పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగానే మరణించడం మాత్రం నీ తప్పే."
ఆ మాట రాము మనసులో బలంగా నాటుకుంది. పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ గమ్యం మన చేతుల్లోనే ఉందని అతను గ్రహించాడు. కేవలం బాధపడుతూ కూర్చుంటే జీవితం మారదని తెలుసుకున్నాడు.
రాము పగలు కష్టపడి పని చేస్తూ, రాత్రిపూట తనకు ఆసక్తి ఉన్న వ్యాపార మెళకువలను నేర్చుకోవడం ప్రారంభించాడు. "ధన మూల మిదం జగత్" అన్న సూక్తిని నమ్మాడు, కానీ అది నీతివంతమైన మార్గంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. చిన్న పెట్టుబడితో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, తండ్రి పడిన కష్టాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగాడు.
కొన్నేళ్ల తర్వాత, రాము తన కష్టంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, తన గ్రామంలోని ఎంతోమంది పేద పిల్లలకు చదువు చెప్పించే వితరణశీలిగా మారాడు.
తన చివరి రోజుల్లో రాము తన వారసులను పిలిచి ఇలా అన్నాడు: "నేను పుట్టినప్పుడు నా చేతిలో ఏమీ లేదు, కానీ నేను వెళ్లేటప్పుడు సమాజానికి కొంత ఇచ్చి వెళ్తున్నాను. అదే మనిషి జన్మకు అసలైన ధన్యత."
చెయ్యి చాచే స్థితి నుండి, చేయూతనిచ్చే స్థాయికి ఎదగడమే జీవిత పరమార్థం.
బి శివ శంకర్ ప్రసాద్
0 Comments