రైతును పారిశ్రామికవేత్తను చేస్తామనడం అపహాస్యం: ఖండాపు ప్రసాదరావు

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 24-02-2026:​ పాలకులు రైతును పారిశ్రామికవేత్తను చేస్తామంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పారిశ్రామికవేత్తలే రైతును దివాళా తీయిస్తున్నారని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ వ్యవసాయ కమిషన్ క్వింటా ధాన్యానికి 3 వేల రూపాయల మద్దతు ధర నిర్ణయిస్తే, కేంద్ర ప్రభుత్వం దానిని 2369 రూపాయలకు కుదించడం స్వామినాథన్ సిఫార్సులను ఉల్లంఘించడమేనని విమర్శించారు. దీనివల్ల ఎకరాకు రైతు 12620 రూపాయలు నష్టపోతున్నారని, ఇది అన్నదాతకు వెన్నుపోటు పొడవడమేనని ఖండించారు. రైసు మిల్లర్లు అదనపు కిలోల పేరుతో రైతును మరింత దోచుకుంటున్నారని, పత్తి, ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఒక్కో రైతు కుటుంబానికి 2,35,554 రూపాయల అప్పు ఉందని కేంద్రమే చెబుతున్నా, బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్వామినాథన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments