ఏపీ అసెంబ్లీ స్థానాలు 263కి పెంపు!

పాలకొండ వెబ్ న్యూస్..: తేదీ: 25 మార్చి, 2026: 
ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఏకంగా 263కి పెంచేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. దీనితో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్న 25 నుండి 37 లేదా 38కి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ మరియు 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టనున్నారు. సుమారు 50 శాతం మేర స్థానాలను పెంచడమే కాకుండా, అందులో 33 శాతం స్థానాలను మహిళలకు కేటాయించే దిశగా నిబంధనలు రూపొందుతున్నాయి.
జిల్లా వారీగా స్థానాల పెంపు అంచనా ఇలా ఉంది:
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లా వారీగా మార్పులు ఈ విధంగా ఉండవచ్చు:
 * శ్రీకాకుళం: ప్రస్తుతం 10 స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత 15కి పెరిగే అవకాశం ఉంది.
 * విజయనగరం: 9 స్థానాల నుండి 15కి పెరుగుతుంది.
 * విశాఖపట్నం: 15 స్థానాల నుండి 23కి పెరుగుతుంది.
 * తూర్పు గోదావరి: 19 స్థానాల నుండి 28కి పెరుగుతుంది.
 * పశ్చిమ గోదావరి: 15 స్థానాల నుండి 22కి పెరుగుతుంది.
 * కృష్ణా: 16 స్థానాల నుండి 24కి పెరుగుతుంది.
 * గుంటూరు: 17 స్థానాల నుండి 25కి పెరుగుతుంది.
 * కర్నూలు: 14 స్థానాల నుండి 21కి పెరుగుతుంది.
 * అనంతపురం: 14 స్థానాల నుండి 21కి పెరుగుతుంది.
 * కడప: 10 స్థానాల నుండి 15కి పెరుగుతుంది.
 * నెల్లూరు: 10 స్థానాల నుండి 15కి పెరుగుతుంది.
 * చిత్తూరు: 14 స్థానాల నుండి 21కి పెరుగుతుంది.
లోక్‌సభ స్థానాలు:
రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్న 25 నుండి 37 లేదా 38కి పెరిగే అవకాశం ఉంది. ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో సుమారు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండేలా నియోజకవర్గాల సరిహద్దులను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని మార్పులకు దారితీయవచ్చు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29 ఎస్సీ మరియు 7 ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మంత్రివర్గ కోటా పెంపు:
శాసనసభ సభ్యుల సంఖ్య 263కి పెరగడంతో, దానికి అనుగుణంగా మంత్రివర్గ కోటా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 26 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య, పునర్విభజన తర్వాత 39కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రకారం ఈ విస్తరణ జరగనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు మరియు స్థానాల పెంపుదల వచ్చే ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
news by: BSS Prasad

Post a Comment

0 Comments