పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 04, 2026: ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల ఉదాసీనతతో రైతాంగం కోలుకోలేని దెబ్బతింటోందని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో అపరాలు పండక ప్రత్యామ్నాయంగా వేసిన కట్టె జనుము పూత వచ్చినా కోతకు రాకపోవడంతో పెట్టుబడులు సైతం దక్కలేదన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాకు వెయ్యి రూపాయలు తక్కువకు కొంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఉల్లి, టమాటా ధరలు పతనమై కనీసం రవాణా ఖర్చులు రాక రోడ్లపై పారబోస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణకు కేటాయించిన 500 కోట్లు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి రాకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారని ప్రసాదరావు ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ధరల పెంచుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత పంటల మద్దతు ధరలకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
News by: BSS Prasad
0 Comments