పాలకొండ వెబ్ న్యూస్ : 10-03-2026.. పాలకొండ నగర పంచాయితీ పరిధిలోని మార్కెట్, వారపు సంత, పశువుల సంత, జంతు వధశాల మరియు బస్సు స్టాండ్ వంటి విభాగాల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆశీలు ఫీజు వసూలు చేసుకునే గుత్త హక్కుల కోసం మంగళవారం నగర పంచాయితీ కార్యాలయంలో రెండోసారి బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో పాల్గొనేందుకు ముగ్గురు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా వారికి సాల్వేన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే వేలం సమయానికి కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 13.57 లక్షల రూపాయల ఆదాయం కంటే ఈసారి ఎక్కువ మొత్తానికి పాట ఖరారు కావాల్సి ఉంది. కానీ పాల్గొన్న పాటదారులు 11 లక్షల రూపాయలకు మించి పాడుటకు ముందుకు రాకపోవడంతో అధికారులు వేలం ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి మూడవసారి వేలం పాటను ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు నగర పంచాయితీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 13వ తేదీ లోపు సాల్వేన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
news by: BSS Prasad
0 Comments