ఇటీవల కాలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ద్విచక్ర వాహనదారుల భద్రతను కాపాడేందుకు పాలకొండ పోలీసులు నడుం బిగించారు. ఇందులో భాగంగా పాలకొండ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన యాలం జంక్షన్ వద్ద వాహనదారుల్లో చైతన్యం నింపేలా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ పోలీసులు ఈ ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. మీ మీద మీ జీవితమే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి అంటూ అందులో ఉన్న నినాదం వాహనదారుల గుండెలను తాకుతోంది.
కేవలం జరిమానాల కోసం కాకుండా ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని మరియు నిలకడైన వేగంతో ప్రయాణించి గమ్యాన్ని సురక్షితంగా చేరాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు నిబంధనలు పాటించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని అధికారులు స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ సానుకూల ప్రచారంపై స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయం కంటే బాధ్యతను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టర్ వల్ల యువతలో మార్పు వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవడమే మీ కుటుంబానికి అసలైన పండుగని, కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పాలకొండ పోలీసులు పిలుపునిచ్చారు.
రిపోర్టింగ్: బిఎస్ఎస్ ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్
0 Comments