మన జీవితంలో మనం చేసే పని ఎంత చిన్నదైనా, దాని పట్ల గౌరవం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చాలామంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో తాము చేసే పనిని తక్కువగా చూస్తుంటారు. కానీ నిజాయితీగా చేసే ఏ పనీ తక్కువ కాదు అని నిరూపించిన మహనీయులు ఎందరో ఉన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త జి. పుల్లారెడ్డి గారి జీవితంలోని ఒక సంఘటన మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఆయన మిఠాయిల వ్యాపారంలో అడుగుపెట్టకముందు వీధుల్లో తిరుగుతూ టీ అమ్మేవారు. ఒకరోజు ఆయన రోడ్డు పక్కన టీ అమ్ముతుండగా, తన బంధువు ఒకరు అటుగా రావడం చూశారు. టీ అమ్మడం అవమానంగా భావించిన ఆయన, ఆ టీ కేటిల్‌ను అక్కడే వదిలేసి చెట్టు చాటున దాక్కున్నారు. ఇంతలో మేకల మంద వచ్చి ఆ కేటిల్‌ను తన్నేయడంతో టీ అంతా నేలపాలైంది. అప్పుడు ఆయనకు ఒక గొప్ప ఆలోచన కలిగింది. "నిజాయితీగా కష్టపడుతున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు సిగ్గుపడాలి?" అని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఆ క్షణం నుండి భయాన్ని వదిలి ధైర్యంగా తన పనిని కొనసాగించారు. ఫలితంగా ఆయన ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్తగా ఎదిగారు.
స్వామి వివేకానంద చెప్పినట్లుగా, "ఏ పనినైనా శ్రద్ధతో, నిబద్ధతతో చేసినప్పుడు మాత్రమే విజయం లభిస్తుంది." అలాగే మహాత్మా గాంధీ గారు కూడా "ఏ పనీ తక్కువ కాదు, ఏ శ్రమ వృథా కాదు" అని నమ్మేవారు. మనం చేసే పనిపై మనకు నమ్మకం ఉన్నప్పుడు, లోకం ఏమనుకుంటుందో అన్న ఆందోళన అవసరం లేదు.
కష్టపడి పని చేయడం గొప్పతనమే కానీ, దాన్ని చూసి సిగ్గుపడటం బలహీనత. మన పని పట్ల మనకు అంకితభావం ఉంటే, ఆ చిన్న పనే రేపు పెద్ద విజయానికి పునాది అవుతుంది. కాబట్టి, ఇతరుల కోసం కాకుండా మన ఎదుగుదల కోసం నిర్భయంగా ముందడుగు వేద్దాం.
......బి శివ శంకర్ ప్రసాద్
0 Comments